
ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కారు కొన్నప్పుడు ఏం జరిగిందంటే..
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి లోను తీసుకుని లాల్ బహదూర్ శాస్త్రి కొనుగోలు చేసిన కారు ఇదే
నీరవ్ మోదీ వ్యవహారం వల్ల తమకి ఇంత అపవాదు వస్తుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజ్‌మంట్ ఎప్పుడూ ఊహించి ఉండదు.
ఈరోజు నీరవ్ మోదీ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఇదే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఒకప్పటి కస్టమరైన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చూపిన ఔన్నత్యం గుర్తుకురాకమానదు.
ప్రధానమంత్రి కాకముందు లాల్ బహదూర్ శాస్త్రికి సొంతిల్లూ, వాహనం ఉండేవి కావు. 'ఇప్పుడు మీరు భారత ప్రధాన మంత్రి అయ్యారు. కాబట్టి మనకు ఒక సొంత కారు ఉంటే బాగుంటుంది కదా' అంటూ ఒకరోజు శాస్త్రిగారి పిల్లలు ఫిర్యాదు చేశారు.
ఆ రోజుల్లో ఒక ఫియట్ కారు 12,000 రూపాయిలకు దొరికేది. ఆయన, తన బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బుందో చూడమని సెక్రెటరీకి చెప్పారు. ఆయన బ్యాంక్ ఖాతాలో కేవలం 7వేల రూపాయిలు మాత్రమే ఉన్నాయి.
"కారు కొనడానికి మా నాన్నగారి దగ్గర తగినంత డబ్బు లేదని తెలిశాక, కారు వద్దులెండి అని మేము చెప్పాం" అని లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు అనిల్ శాస్త్రి బీబీసీతో అన్నారు.
కానీ బ్యాంక్‌లో లోన్ తీసుకుని కారు కొందామని శాస్త్రి చెప్పారు. అలా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 5వేల రూపాయిలు లోన్ తీసుకున్నారు.
ఇది జరిగిన ఒక సంవత్సరం తరువాత ఆ లోన్ తీర్చకముందే శాస్త్రి చనిపోయారు.
ఆయన తరవాత ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ, ఆ లోన్‌ను మాఫీ చేయాలని ప్రభుత్వం తరఫున నిర్ణయించారు.
కానీ శాస్త్రి భార్య లలితా శాస్త్రి దానికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. తరవాత నాలుగేళ్లవరకు తనకొచ్చే పెన్షన్‌తో బ్యాంక్ లోన్ మొత్తం తీర్చేశారు.
ఈ కారు ఇప్పుడు దిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్‌లో ఉంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఈ కారును, ఆయన స్మృతులను చూడటానికి వస్తుంటారు.
No comments:
Post a Comment