• సిరులు కురిపించే శ్రీగంధం
* తిరుమల గిరుల్లో వంద హెక్టార్లలో సాగు
* 20 ఏళ్ల తరువాత 27 కోట్లు ఆదాయం
తిరుమల శేషాచలం అడవుల్లో శ్రీగంధం పెంపకంపై టీటీడీ అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో 82 హెక్టార్లలో శ్రీగంధం మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. మరో 18 హెక్టార్లలో శ్రీగంధం మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతులు కూడా శ్రీగంధం సాగుపై దృష్టి సారించి,
మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు
అటవీ శాఖ అధికారులు.
శ్రీగంధం మొక్క తనంతట తాను ఆహారాన్ని సేకరించుకుని పెరగదు. పక్కన ఉన్న మొక్కల నుంచి ఆహారాన్ని సేకరించుకుని పెరగడం శ్రీగంధం మొక్క లక్షణం. అంటే శ్రీగంధం మొక్కను నాటాలంటే దాని పక్కన మరో మొక్కను కూడా నాటాల్సి ఉంటుంది. నర్సరీ వయస్సులో శ్రీగంధంకు పక్కనే పొనగంటి, ఇరాంటమ్ వంటి మొక్కలను పెంచాల్సి ఉంటుంది. సాగుచేసే సమయంలో ప్రతి శ్రీగంధం మొక్క పక్కన కంది మొక్కలను నాటాలి.
అదేవిధంగా ప్రతి 6 శ్రీగంధం మొక్కలకు ఒక ఎర్రచందనం మొక్కను నాటాలి. రెండు, మూడేళ్ల వరకు కంది మొక్కలు శ్రీగంధానికి ఆహారంగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఎర్రచందనం లేదా రోజ్‌వుడ్ వంటి మొక్కల వేర్ల నుంచి శ్రీగంధం మొక్కలు ఆహారాన్ని సేకరిస్తాయి. మూడు అడుగులులోపు ఉండే కలుపు మొక్కలను శ్రీగంధం మొక్కల పక్కన పెంచితే మరింత ఏపుగా పెరిగే అవకాశం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
• ఔషధాలు..సుగంధ ద్రవ్యాల్లో..
పర్‌ఫ్యూమ్స్, సెంట్లు, సబ్బులు, అగరబత్తిల తయారీల్లో విరివిగా శ్రీగంధాన్ని వినియోగిస్తారు. అదేవిధంగా ఔషధగుణాలు ఉండడం వలన ఫార్మాస్యుటికుల్ కంపెనీల్లో కూడా శ్రీగంధం తైలాన్ని వాడతారు. ఇతర దేశాల శ్రీగంధం మొక్కలు కన్నా మనదేశంలోని శ్రీగంధం రకానికే మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది. మన గంధంలోనే నూనెల శాతం, పరిమళ శాతం ఎక్కువగా ఉంటుంది.
ఒక హెక్టారు భూమిలో 1000 మొక్కలు నాటుతారు.
ఇందులో 600 మొక్కలు పక్వానికి వస్తాయి.
శ్రీగంధం మొక్క పూర్తిస్థాయి వినియోగంలోకి రావాలంటే దాదాపు 20 ఏళ్లు పడుతుంది.
బెరుడు (స్టెమ్) కేజీ విలువ మార్కెట్లో రూ.11 వేలు పలుకుతోంది. శ్రీగంధం వేరు ఒక కేజీ రూ.15 వేలుగా ఉంది. 20 సంవత్సరాల తరువాత కేజీ శ్రీగంధం ధర కిలో రూ. 40 వేలకు చేరుకుంటుంది. ఒక్కొ చెట్టు నుంచి 10 కేజీల శ్రీగంధం వస్తుంది. ఈ లెక్కన 600 చెట్ల నుంచి 6000 కేజీలు(6 టన్నులు) శ్రీగంధం కలప వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ధర రూ. 15వేలు. 20 ఏళ్ల తరువాత ఈ ధర రూ. 40వేలకు పెరుగుతుందని అంచనా. ఈ ధరతో లెక్కిస్తే ఒక హెక్టారుపై లభించే ఆరు టన్నుల శ్రీగంధం ద్వారా
రూ. 27 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.
• రైతులకు అనుకూలం
రైతులు కూడా శ్రీగంధాన్ని పెంచుకోవచ్చు. దీన్ని శాస్త్రీయంగా పెంచడంతో పాటు దొంగల నుంచి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే శ్రీగంధం రైతు ఇంట సిరులు కురిపిస్తుంది. 20 ఏళ్ల తరువాత ఒక హెక్టారుపై రూ. 27 కోట్ల మేరకు ఆదాయం పొందే వీలుంటుంది.
- శ్రీనివాసులు, టీటీడీ ఫారెస్ట్ ఇన్‌చార్జి డీఎఫ్‌ఓ
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, తిరుపతి
.... నవ్య ఫీచర్స్
Saturday, 5 May 2018
సిరులు కురిపించే శ్రీగంధం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment