కుంకుమ పెట్టుకోవడమంటే అమ్మాయిలకు ఎందుకంత ఇష్టమో తెలుసా!
భారతీయ నారీమణులు నుదుటిన కుంకుమ ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. సింధూరంతో వారిది విడదీయరాని అనుబంధం. పెళ్లైన మహిళలు తప్పకుండా కుంకుమ పెట్టుకుంటారు. ఇది వారు పుణ్య స్త్రీలు అనడానికిప్రతిబింబంగా నిలుస్తుందన్నది తరాల నుంచీ వస్తున్న విశ్వాసం. సింధూర ధారణ వెనక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని అంటారు. మరికొందరు చారిత్రక కారణాలు ఉన్నాయంటారు. ఏదేమైనా కొన్ని వేల ఏళ్ల క్రితం భారత్‌కు వచ్చిన నిషాధ జాతి నుంచి మన దేశం సింధూర ధారణను స్వీకరించింది. దాని వెనకాల ఉన్న ఆసక్తికర నేపథ్యాల గురించి తెలుసుకుందామా!
సింధూరం లేదా కుంకుమ సింధూర (అచియోటి) చెట్టు నుంచి తయారు చేస్తారు. పారిశ్రామికంగా అయితే పసుపు, నిమ్మతో ఉత్పత్తి చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెళ్లైన భారతీయ మహిళలు నుదుటిన కుంకుమ పెట్టుకోవడం ఒక సంప్రదాయం. ఇది వారి జీవితంలో ఒక విడదీయరాని భాగంగా మారింది. అలాగే భారతీయ సంస్కృతి నుంచి కూడా.
కుంకుమ పెట్టుకోకపోతే ఆ మహిళ వితంతువని అర్థం. అలాగే వారు మైలలో ఉన్నారని తెలుస్తుంది. భారత దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కుంకుమను ఉపయోగిస్తారు. దీన్ని అల్లుకొని ఎన్నో పౌరాణిక గాథలు ఉన్నాయి. మన దేశంలో పెళ్లైన మహిళల అంకరణలో సింధూర ధారణతో ఎందుకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందో ఉన్న కారణాలు తెలుసుకుందాం.
సంతానోత్పత్తికి చిహ్నం
మన దేశంలో కుటుంబాన్ని సమాజంలో ఒక భాగంగా భావిస్తారు. సృష్టి కార్యం ద్వారా సంతానోత్పత్తికి మూలమైన స్త్రీమూర్తికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఆమె నవమాసాలు మోసి బిడ్డల్ని కంటుంది. రుతుస్రావంలో వచ్చే రక్తాన్ని సంతానోత్పత్తికి ప్రతిరూపం అంటారు. రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. అదే సంతానో్త్పత్తికి చిహ్నంగా మారింది. ప్రతిసృష్టి చేయగల మహిళలను ప్రకృతితో సమానంగా భావించడం భారతీయ తాత్వికత. ఒక సృష్టికర్తగా తన బాధ్యతలు ఎరిగిన మహిళ తన పాత్రకు రుణపడి సింధూర ధారణ చేస్తుంది.
ఆజ్ఞా చక్రానికి రక్ష
యోగ శాస్త్ర ప్రకారం మానవ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. శక్తికి మూలాధారమైన ఈ చక్రాలు జీవ వ్యవస్థ సంరక్షణలో అత్యంత కీలకం. ఈ కేంద్రాలు రక్తంలోనికి హార్మోన్లు విడుదల చేసే ఆంత్రస్రావ (ఎండోక్రైన్) గ్రంథుల వద్ద శక్తికి మూలాధారమై ఉంటాయి. ఆ చక్రాలు ఇవీ. మూలాధార చక్రం (పీఠం వద్ద), స్వాధిష్ఠాన చక్రం (ఉదర కుహరమున), మణిపూర (జఠరాగ్ని వద్ద), అనాహత చక్రం (గుండె వద్ద), విశుద్ధ (గొంతు వద్ద), ఆజ్ఞా చక్రం (నుదుటిన), సహస్రార చక్రం (నడి నెత్తిన). మనం ముఖాన్ని దేనితోనూ కప్పలేం. ఇక్కడ ఉండే ఆజ్ఞా చక్రాన్ని అత్యంత బలహీన శక్తికేంద్రం అంటారు. శక్తి అపభ్రంశం కాకుండా ఈ కేంద్రాన్ని కాపాడేందుకు ఇక్కడ మహిళలు, పురుషులు కుంకుమ పెట్టుకుంటారు.
ఆయుర్వేదంలో ప్రాముఖ్యం
భారతీయులు అనాదిగా ఉపయోగిస్తున్న పురాతన వైద్యం ఆయుర్వేదం. దీని ప్రకారం పసుపు, నిమ్మ, సీసం రక్త పోటు (బీపీ)ని నియంత్రిస్తాయి. ఇవి మహిళల్లో సంతానోత్పత్తిని పెంచుతాయి. పై ధాతువులతో తయారుచేసే కుంకుమను మహిళలు పిట్యుటరీ గ్రంథి వద్ద పెట్టుకోవాలి. అందుకే ఉత్తర భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్, బిహార్ ఇంకా చాలా చోట్ల మహిళలు పాపిటలో కుంకుమ అలంకరించుకుంటారు. అంటే నుదుటున ఉన్న ఆజ్ఞా చక్రం నుంచి నడినెత్తిన ఉన్న సహస్రార చక్రం వరకు అన్నమాట.
సంస్కృతిలో భాగం
భారతదేశమంతటా కుంకుమ ధరించడం పెళ్లైన మహిళల్లో ఒక ఆచారంగా మారిపోయింది. కుంకుమ పెట్టుకోకున్నా మరిచిపోయినా ఏదో లోటుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైనా ఇంట్లోకి స్త్రీలు వచ్చినప్పుడు ఆ ఇంటి మహిళ కుంకుమ ఇవ్వడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇలా కుంకుమను ఇవ్వడం ద్వారా పరస్పర గౌరవం, ప్రేమ, అనురాగాన్ని పెంచుకుంటారు. ప్రతి పండగకు, మిగతా వేడుకలకు దక్షిణ భారతదేశంలో ముత్తైదువలు బంధువులు, స్నేహితులకు పసుపు, కుంకుమ వాయినంగా ఇస్తుంటారు. దీనిని సారె అని కూడా అంటారు.ఇక పశ్చిమ బంగాలో పెళ్లైన మహిళలు విజయ దశమి రోజున సింధూర్ ఖేలా జరుపుకుంటారు. ఆ రోజున దుర్గామాతకు కుంకుమ సమర్పించి ముఖాలకు రాసుకుంటారు. ఈ పద్ధతి ద్వారా ప్రతి మహిళా ఆదిశక్తి స్వరూపమే అని తెలియజేస్తారు.
అమ్మవారికి సమర్పణ
చాలాసార్లు నవ వధువుగా, అమ్మగా, గౌరీ మాతగా, ఆదిశక్తి అవతారంగా కొలిచే దుర్గామాతకు, సిరి సంపదలను అనుగ్రహించే శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించేటప్పుడు కుంకమను సమర్పిస్తారు. అలా సమర్పించిన సింధూరాన్ని ప్రసాదంగా భావిస్తారు. స్వయంగా అమ్మవాకి ఆశీర్వాదంగా భావించి ఇతర మహిళలకు ఇస్తారు. ఇక దుర్గా మాత, లక్ష్మీ మాత, విష్ణు మందిరాల్లో తరచుగా కుంకుమను సమర్పించే సంగతి తెలిసిందే.
Saturday, 5 May 2018
కుంకుమ పెట్టుకోవడమంటే అమ్మాయిలకు ఎందుకంత ఇష్టమో తెలుసా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment