
ఒక్క క్షణం చాలు జీవితం మారిపోవడానికి... ఒక్క అవకాశం చాలు వెలుగులోకి రావడానికి.. చిన్న ప్రోత్సాహం చాలు ప్రపంచాన్ని గెలవడానికి! మణికందన్ జీవితంలో ఇవన్నీ జరిగాయి.
లేకపోతే ఏడేళ్ల వయసులో సోదరిని వెంటపెట్టుకొని దిక్కూమొక్కు లేకుండా రోడ్ల మీద భిక్షమెత్తుకున్న మణికందన్ ఇప్పుడు స్పెయిన్ వెళ్లడమేంటి? ఉండడానికి చోటు లేని స్థాయి నుంచి ఒక నెలంతా విదేశాల్లో ఉండే అవకాశం రావడమేంటి? జీవితం తనను ఒక ఆట ఆడుకునే స్థాయి నుంచి ఇప్పుడతనే రియల్ మాడ్రిడ్ లాంటి గొప్ప క్లబ్‌లో ఫుట్‌బాల్ శిక్షణ తీసుకోవడానికి వెళ్లడమేంటి? ఇదంతా చిత్రంగా అనిపిస్తోంది కదూ! పదండి ఆ కథేంటో తెలుసుకుందాం!
కొల్లాం (కేరళ): ప్రస్తుతం 14 ఏళ్ల వయసున్న ఆర్.మణికందన్ ఏడేళ్ల వయసున్నపుడు తన సోదరిని వెంటబెట్టుకుని కేరళలోని కొల్లాం ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటూ తిరుగుతుండేవాడు. వాళ్లిద్దరినీ చూసి అనాథ శరణాలయం నడిపే శ్రీకుమార్ చేరదీశాడు. అతడి ఆశ్రమంలో పిల్లలు ఎక్కువ కావడంతో స్థలం లేక.. దగ్గర్లోని ఫాతిమా మాత కళాశాల మైదానం దగ్గర కొంతమందిని ఉంచేవాడు.
అదే మైదానంలో కోచ్ అభిలాష్ ఆటగాళ్లకు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇచ్చేవాడు. సరదాకి ఫుట్‌బాల్ ఆడుతూ ఆ కోచ్ కళ్లల్లో పడ్డాడు మణికందన్. అతడి ప్రతిభను గుర్తించి సీనియర్ ఆటగాళ్లతో ఆడే అవకాశం కల్పించాడు అభిలాష్. అంతే మణికందన్ జీవితం మారిపోయింది. ఫుట్‌బాల్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి ఇప్పుడు స్పెయిన్ వెళ్లే అవకాశాన్ని దక్కించుకొన్నాడు.
స్పెయిన్‌లో ఒక నెల శిక్షణ తర్వాత అతణ్ని అమెరికాకు పంపే అవకాశం కూడా ఉంది. అండర్-16 ఆటగాడిగా చెన్నైలోని ఫుట్‌బాల్ ప్లస్ ప్రోఫెషనల్ సాకర్ అకాడమీకి మణికందన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడి ప్రతిభ గుర్తించి చెన్నై అకాడమీ అధికారులు విదేశీ కోచ్‌లకు చెప్పి, ప్రత్యేక శిక్షణకు సిఫారసు చేశారు. ‘‘మణికందన్ బిడియంగా ఉంటాడు. ఫుట్‌బాల్‌లో సాధించిన విజయాలే అతని గురించి మాట్లాడతాయి.
మైదానంలో చిరుతలా పరిగెడుతూ ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తాడు’’ అంటూ తాను చేరదీసిన కుర్రాడి గురించి శ్రీకుమార్ చెప్పాడు. ‘‘గత జనవరిలో అతణ్ని చూశా. ఒక్క ఏడాదిలోనే చాలా అభివృద్ధి చెందాడు. అతను కచ్చితంగా భారత్ తరపున ఆడతాడు’’ అని మణికందన్ ఫుట్‌బాల్ ప్రతిభను గుర్తించిన అభిలాష్ చెప్పాడు. ‘‘ఫుట్‌బాల్ అంటే నాకు పిచ్చి. నేను ఆటగాడిగా మారానంటే ఆ ఘనత శ్రీకుమార్, అభిలాష్‌లకే చెందుతుంది. వాళ్లు నన్ను బాగా ప్రోత్సహించారు. మెస్సి అంటే చాలా ఇష్టం. భారత జెర్సీ వేసుకొని దేశం తరపున ఫుట్‌బాల్ ఆడాలనేదే నా లక్ష్యం’’ అని మణికందన్ అంటున్నాడు.
No comments:
Post a Comment