Saturday, 5 May 2018

ఫక్తు మంసాహారి.. జాతి సంహారి

• ఫక్తు మంసాహారి.. జాతి సంహారి
* నగరంలో ప్రమాదకర క్యాట్‌ఫిష్‌ కలకలం

* బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా రవాణా ‌
శంషాబాద్‌ విమానాశ్రయంలో క్యాట్‌ఫిష్‌ను నిఘావర్గాలు పట్టుకోవడం కలకలం రేపుతోంది. దేశంలో నిషేధితమైన వీటిని బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా దిగుమతి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి కావడం చర్చనీయాంశంగా మారింది. కార్గోలో అట్టపెట్టెల్లో తీసుకొచ్చిన వీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయంపై పోలీసులకు ఇంకా స్పష్టమైన సమాచారం లభించలేదు. కార్గో విమానాశ్రయానికి చేరుకోకముందే విషయం బయటికి పొక్కి అధికార యంత్రాంగాలు అప్రమత్తం కావడంతో సరకు తీసుకోవాల్సిన నిందితులు కాస్త జారుకున్నారు. బీదర్‌కు తరలించేందుకే వీటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారని కొంతమేర సమాచారం అందినా.. హైదరాబాద్‌కే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.
ఈ నేపథ్యంలో అసలు క్యాట్‌ఫిష్‌ కథేమిటో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.
చేపల్ని నమిలేస్తుంది.. మనుషుల్నీ తినేస్తుంది..

‘క్యాట్‌ఫిష్‌’ చేప జాతిలో ఒకటే అయినా మిగతా చేపలకు ఇది పూర్తిగా భిన్నం. సాధారణంగా చేపలు నీటిలోని నాచు, గడ్డిని తిని బతుకుతాయి. కానీ క్యాట్‌ఫిష్‌ పూర్తిగా మాంసాహారి. ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌గా పిలుచుకునే దీనికి కోళ్ల వ్యర్థాలే ఆహారం. కోడి కాళ్లు, చర్మం, తల.. తదితర వ్యర్థాలను తింటుంది. ఇది ఎక్కడి నీళ్లలో ఉంటే అక్కడి మిగతా చేపల్ని పూర్తిగా తినేస్తుంది. ఒక ప్రాంతంలో పది క్యాట్‌ఫిష్‌లను వేస్తే ఏడాది తిరిగేసరికల్లా లక్ష క్యాట్‌ఫిష్‌లుగా రూపాంతరం చెందుతాయి. మిగిలిన చేపజాతి మనుగడకు ముప్పుగా పరిణమించినందువల్లే భారత ప్రభుత్వం దేశంలో వీటి పెంపకాన్ని నిషేధించింది. మరోవైపు వీటి పెంపకం కోసం చేపట్టే చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను వేస్తున్న కారణంగా భూగర్భజలాలు కలుషితమై పర్యావరణానికి ముప్పు కలుగుతోంది. దీనికితోడు కొన్ని క్యాట్‌ఫిష్‌లు 20 కిలోల వరకు పెరుగుతాయి. ఇలాంటివి ఉన్న నీటిలో పొరపాటున మనుషులు పడినా సులభంగా చంపి తినేస్తాయి. అంతటి భయంకరమైనవి కావడం వల్లే వీటి పెంపకంపై నిషేధం అమల్లో ఉంది.
* తక్కువ ధరకు విక్రయాలతో గిరాకీ
వీటిపై నిషేధం ఉన్నా దొంగచాటుగా దిగుమతి చేస్తూ అక్కడక్కడ రహస్యంగా చెరువుల్లో పెంపకాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విమానంలో దిగుమతి చేస్తూ పోలీసులకు చిక్కడం గమనార్హం. చికెన్‌ విక్రయాల సందర్భంగా పారబోసే వ్యర్థాలతోనే క్యాట్‌ఫిష్‌ను పెంచడంతో పెద్దగా వ్యయప్రయాసలుండవు. అందుకే అక్రమంగానైనా వీటిని పెంచేందుకు కొన్ని ముఠాలు మొగ్గు చూపుతున్నాయి. సాధారణంగా మంచిరకం చేపలు కిలోకు రూ.200-600 వరకు దొరుకుతాయి. అవే క్యాట్‌ఫిష్‌ అయితే కేవలం రూ.60-90కే దొరికే అవకాశముంటుంది. అక్రమార్కులు వీటిని కొనుగోలు చేసి మంచిరకం చేపల కింద విక్రయించి సొమ్ము చేసుకుంటుంటాయి. అందుకే ఈ అక్రమాన్ని రుచిమరిగిన ముఠాలు లాభాపేక్షతో వీటి పెంపకం వైపు మొగ్గు చూపుతున్నాయని రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకుడు రామరాజు అభిప్రాయపడ్డారు.
.... ఈనాడు, హైదరాబాద్

No comments:

Post a Comment